Fundraising 2010/Appeal/te

From Meta, a Wikimedia project coordination wiki

పదేళ్ళ క్రితం వికీపీడియా గురించి మొట్టమొదట నేను వివరించినప్పుడు నన్ను చాలా మంది వింతగా చూసారు.

ప్రపంచం నలువైపులలనుంచి...విజ్ఞానాన్ని పంచుకోవాలన్న సదాశయం కలిగిన అనేకమంది ఔత్సాహికులు ముందుకొచ్చి చేయీచేయీ కలపడంద్వారా ఒక బృహత్తర జ్ఞానభాండాగారాన్ని సృష్టించవచ్చన్న భావనను వ్యాపార దృక్పథమున్న కొందరు తేలిగ్గా కొట్టిపారేశారు.

వ్యాపారప్రకటనలు లేవు. లాభాపేక్ష లేదు. లోగుట్టులు అసలే లేవు.

పదిసంవత్సరాలు పూర్తిచేసుకున్న వికీపీడియాని ప్రతీ నెలా 38 కోట్ల మంది పైగా – దాదాపుగా అంతర్జాలం ఉపయోగించేవారిలో మూడో వంతుమంది - ఉపయోగిస్తున్నారు.

ప్రపంచంలో అత్యంత జనాదరణ పొందిన జాలగూళ్ళ(వెబ్సైట్)లో ఇది ఐదవస్థానంలో ఉంది. ఆ మొదటి నాలుగింటినీ కోట్లాది రూపాయల పెట్టుబడి, భారీ సిబ్బంది మరియు ఎడతెగని ప్రచారంతో ఏర్పాటుచేసి నడిపిస్తున్నారు.

కానీ, వికీపీడియా మిగిలిన వాణిజ్య తరహా జాలగూళ్ళ కిందికిరాదు. తమవద్ద ఉన్న జ్ఞానసంపదను పంచుకోవాలనే సదుద్దేశంతో కొందరు ఔత్సాహికులు స్వచ్ఛందంగా అందించిన అమూల్య సమాచారంతో ఇది రూపొందింది. ఆ ఔత్సాహికుల సముదాయం సృష్టించిన ఈ విజ్ఞాన భాండాగారంలో మీరూ భాగస్వాములే. వికీపీడియాని సంరక్షించడానికి, ముందుకు నడపటానికి మీరు తలో చేయీ వేయాలని ఈ లేఖద్వారా మిమ్ములను అభ్యర్ధిస్తున్నాను.

మనందరం కలిసి దీన్ని ఉచితంగా మరియు వ్యాపారప్రకటనలు లేకుండా నడపవచ్చు. దీన్ని అందరికి అందుబాటులో ఉంచుదాం – వికీపీడియాలోని సమాచారాన్ని మీరు మీ ఇష్టమొచ్చినట్లు ఉపయోగించుకోవచ్చు. జ్ఞానాన్ని నలుదెసలా వ్యాపింపజేసేలా, అందరూ జ్ఞానసంపదను పంచుకునేలా - వికీపీడియాను మనం అభివృద్ధి పథంలో నడిపించవచ్చు.

మనందరి ఉమ్మడిసొత్తయిన ఈ సంస్థను ముందుకు నడపటానికి $20, $35, $50 వంటి నామమాత్రపు విరాళాలతో సాయపడమని మీతో సహా ఈ సముదాయంలో భాగస్వాములైన వారందరినీ ప్రతి ఏటా ఈ సమయంలో అభ్యర్ధిస్తూ ఉంటామని మీకు తెలుసు.

మీరు వికీపీడియాని ఒక సమాచార వనరుగా మరియు స్ఫూర్తిగా మన్నిస్తే మీరు వెంటనే స్పందిస్తారని ఆశిస్తున్నాను.

శుభాకాంక్షలతో,

జిమ్మీ వేల్స్

సంస్థాపకులు, వికీపీడియా

తా.క: మనలాంటి వ్యక్తులం కలిస్తే ఏర్పడ్డ శక్తితో అపూర్వమైన పనులు చేయవచ్చని నిరూపించేదే వికీపీడియా. ఒక్కో పదం పేర్చుకుంటూ, మనం వికీపీడియాని రూపొందిస్తున్నాం. ఒక్కో విరాళంతో, మనం దీన్ని ఆర్ధికంగానూ నిలబెడదాం. మన సమష్ఠిశక్తికి ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందనడానికి ఇది ఒక నిదర్శనం.